కవిత 2011
వర్గం: కవితా సంకలనం
సానుకూలం
వ్యతిరేకం
ఒకరివే రెండు కవితలు అవసరమా? గతంలోలాగే, ‘ఇందులో చోటు చేసుకోని కవులున్నారా’ అని పరిశీలించి, తర్కించుకున్నారా? క్రమం తప్పకుండా వస్తున్న ప్రచురణ గనుక, ‘కవిత సిరీస్’ బాధ్యులు ఈ ప్రశ్నలను గమనించవలసి ఉన్నది.
అతడి వెనుక మధుబాల లేదు / అతడి కళ్ళలో జాలీ లేదు/ నా ఇరానీ కేఫ్ చచ్చిపోయింది / ఒక సంస్కృతి మరణించింది/ జీవితంలో ఒక భరోసా, ఒక నింపాదితనం మరణించింది (‘ఇరానీ మరణం’ నుంచి -వంశీకృష్ణ)
చాదర్ఘాట్(హైదరాబాద్) బ్రిడ్జి ముందు నిల్చున్నాడు కవి. రెండు కప్పుల టీ తాగి, నాలుగు గంటలపాటు కవిత్వ వేడుకలో మునిగితేలేందుకు వేదిక అయిన అక్కడి ఇరానీ కేఫ్ ఏమైంది, ఏమైందని విలపిస్తున్నాడు కవి.
అమ్మ అందమైన గర్భసంచి నుంచే, నేను పుట్టకముందు నుంచే
సౌందర్యాన్ని రక్షించే దైవకులవృత్తి ప్రారంభించాను ఎప్పుడో
భూమి పుట్టకముందే / ‘only beauty will save the world ‘
(‘సౌందర్య తపస్సు’ నుంచి -దెంచనాల శ్రీనివాస్ )
సౌందర్యం కోసం నిజంగానే తపస్సు ఈ కవిత.
యుద్ధం రాబోతున్న సంకేతమేదీ వుండదు
ఒక్కోసారి యుద్ధం మొదలైందన్న సంగతే తెలీదు…
చొరవ అతడిదో, లేక ఆమెదో / ఒక చిరునవ్వో, ఒక క్షమాపణో, మరేదో.. /
త్వరగానే గోడ ధ్వంసమైపోతుంది (‘కోల్డ్‌వార్ ‘ నుంచి -కోడూరి విజయకుమార్)
జీవిత భాగస్వాముల మధ్య ఘర్షణలు, సర్దుబాట్లు మామూలే. అవి ఎలా జరుగుతాయో ఎంతో పరిశీలనతో చిత్రిక పట్టాడు కవి.
ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన, / వచ్చినంక నాతోటే ఉంటదా పోతదా
తర్వాత ముచ్చట… / ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన..
లేకపోతే ఈడ నాకేం పని?! (ఒక కరుత్తమ్మ కోసం-మోహన్ రుషి)
ముచ్చటైన తెలంగాణ మాటలతో మోహన్ రుషి, కావ్యనాయకి కోసం భలేగా ఎదురుచూశాడు. ఈ కవిత మొత్తం కోట్ చేయదగ్గ కవిత. ఇక్కడో వటవృక్షం పిట్టల గుంపుతో కిలకిల మంటూండేది! / ఎవరో నరికేసినట్టున్నారు.. / ఇక్కడో తీగ చుట్టుకొని విరగ కాస్తూ పరిమళిస్తుండాలి! / ఎవరో తుంచేసినట్టున్నారు.. (ఇక్కడో …-కె.క్యూబ్ వర్మ)
ఇది కూడా కవి విలాపం. ఆక్రోశం. విరిగిపోయిన వాటి గురించిన వేదన , కరిగిపోయిన వాటి గురించిన నివేదన.
ఇలాంటి అసలు సిసలు కవిత్వమే కాదు, కవిత్వం పేరుతో అచ్చమైన అకవిత్వం కూడా చాలా ఉంది ఇందులో. ఇంతకు ముందు సాహితీమిత్రులు ప్రచురించే ‘కవిత’ సిరీస్‌లో మూడింట రెండు వంతులో, ఒక వంతో కవిత్వం వస్తూవుంటే, రాను రాను వేళ్లమీద లెక్కపెట్టుకునే స్థాయికి అవి తగ్గిపోయాయి. సంపాదకవాక్యం రాస్తూ దర్భశయనం శ్రీనివాసాచార్య ‘కవి తప్పక స్వీయసమీక్ష చేసుకోవలసిన అవసరం ఉంది’ అని రాశారు. మంచిదే. ప్రతి ‘సారీ’ ఇలా ముందుమాటలోనో, వెనుకమాటలోనో అంటూపోతుంటే, కవిత్వలోటు భర్తీ అయిపోతుందా? మార్గాంతరముందా? ఇందులో కవుల బాధ్యత ఎంత, సంపాదకుల బాధ్యత ఎంత? ఇన్ని పేజీల్లో ఈ పుస్తకముండాలని నియమమా? ఒకరివే రెండు కవితలు అవసరమా? గతంలోలాగే, ‘ఇందులో చోటు చేసుకోని కవులున్నారా’ అని పరిశీలించి, తర్కించుకున్నారా? క్రమం తప్పకుండా వస్తున్న ప్రచురణ గనుక, ‘కవిత సిరీస్’ బాధ్యులు ఈ ప్రశ్నలను గమనించవలసి ఉన్నది. అపుడు ఈ ప్రచురణ మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
సౌజన్యం : ఆంధ్రజ్యోతి దినపత్రిక

























































